Monday, December 24, 2012

చంద్ర స్పర్శ - II

        రఘుపతి కి ఇంటి నించి ఫోన్ వచ్చింది.

రఘుపతి భార్య: ఏమండి, ఇవాళ మీ పుట్టిన రోజు మరిచిపోయారా?

రఘుపతి: (తల మీద చేతితో రాస్తూ ...) అరె, పని హడావిడిలో మర్చిపోయాను.

భార్య: మీరు మర్చి పోతారని నాకు తెలుసండి. అందుకే ఆంజనేయుడి ప్రసాదం, తాయెత్తు బాగ్ లో ఉంచాను. తీసుకుని, చేతికి కట్టుకొండే? (చెప్పింది)

రఘుపతి: రాజీ, నాకివన్నీ ఇష్టం ఉండవని నీకు తెలుసు కదరా. ఆంజనేయ స్వామి ప్రసాదం అంటే ఒకే, ఇంకా ఈ తాయెత్తు లేమిటి, చిన్న పిల్లల్లాగా?

భార్య: కట్టుకోండి లేదంటే నామీద ఒట్టే. (చెప్పేసింది).

రఘుపతి: నీకు నామీద ఉన్న concern  కి ఒకే అనుకో, కానీ, ఈ జాతకాలు, తాయెత్తులు, నాకు ఇష్టం ఉండవు నీకు తెలిసినదే కదా.

భార్య: మీదంతా వితండ వాదం. అయినా, ఎక్కడెక్కడో ఉంటారు, ఏవేవో కేసులంటారు, మన జాగ్రత్త లో మనం ఉండాలి కదండీ.

రఘుపతి: అంటే ఇప్పుడు ఏమిటి రాజీ, నా revolver నాకు హెల్ప్ చెయ్యదా ఏమిటి, నా ట్రైనింగ్ నా చదువు అన్నీ ... (ఇంకా ఏదో చెప్తున్నాడు).

భార్య: అబ్బ ఊరుకోండి. అయినా చెప్పిన జాతకం లో ఎన్ని జరిగాయి మనకి, అన్నీ మర్చిపోయారా.

రఘుపతి: (నిట్టూరుస్తూ...) అంటే, ఏమిటి, ఈ తాయెత్తు నేను కట్టుకోవాలి, అంతే కదా! ఓకే (కట్టుకుంటూ)

భార్య: Good boy!

రఘుపతి: నీకోసమే కట్టుకున్నాను రా, అయినా మన ఫ్యూచర్ మనకే తెలియదు ఇంకా ఎవడికో ఎలా తెలుస్తుంది చెప్పు!

- 2 - 

Tuesday, December 11, 2012

వల్లి (పిచ్చి, ప్రేమ, కథ)

టీవీ 19 న్యూస్ లో వస్తోంది. Live గా అవార్డ్ ల హాల్ ముందు నించి కవర్ చేస్తున్నారు.

టీవీ 19: జానపద కళా ప్రపూర్ణ, జానపద కథల సామ్రాట్, గోల్డెన్ హాండ్ "సాహితి వర్మ" గారు, ఇప్పుడే వస్తున్నారు. ఆయన కారు బంజారా హిల్స్ దాటిందని ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ శ్రీ అవార్డ్ కి, ఆయన ఎంపిక అవ్వడం ముదావహం. ఈ లోపులోనే ఆయన రాసిన కథకి, ఎనిమిది నంది అవార్డులు రావడం నిజంగా, గొప్ప విషయం. ఈ విషయం పైన మీ కామెంట్స్ ఏమిటి? (స్టూడియో కి కాలు transfer  చేస్తూ అంది ...)

స్టూడియో: నిజంగా, మన తెలుగు కథల్లో మనదనేది, తగ్గిపోతోంది, ఇప్పుడు పరిస్థితి ప్రకారం చూస్తె, అసలు తెలుగు కథలు తెలుగు లాగానే ఉండటం లేదు. అటువంటి సమయం లో, మళ్ళీ ఆ పాత "కత్తి కాంతారావు" ని తెర మీద ఆవిష్కరించడం అనేది, చాలా గొప్ప విషయం. దాంతో పాటుగా, మంచి viewership, మంచి అవార్డులు ఒకే సారి, ఆ..., కొట్టెయ్యడం అనేది, చాలా గొప్ప విషయం. నిజంగా వర్మ గారు, మన తెలుగు వాడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వ పడుతున్నాను.

-- 2 --

టీవీ 19: అలాగే ఇప్పుడు వర్మ గారు వచ్చేసారు. ఆయననే అడుగుదాం. (కారు దిగిన వర్మ తో ...)

టీవీ 19: వర్మ గారు, "what is your secret of success?"

వర్మ: నవ్వుతూ, మా అమ్మా నాన్నల ఆశీర్వాదం, తెలుగు ప్రజల ఆకాంక్ష, (ఈ మాట వింటూనే అక్కడ ఒక పెద్ద roar  వినిపించింది), నా నిరంతర ఆపేక్ష (ముగించాడు).

టీవీ 19: (ఇంక ముగిస్తూ) చూసారు కదండీ, ఇది మన తెలుగు ముద్దు బిడ్డ వర్మ గారి అంతరంగం. చూస్తూనే ఉండండి టీవీ 19, మీ ఫేవరెట్ న్యూస్ చానల్.

-- 3 --

అవార్డులు అయ్యాక, జనాల హర్ష ధ్వానాల మధ్య, కారు ఎక్కి కూర్చున్నాడు వర్మ. కారులో ఉన్నాడు మామ, తనకి వరసకి మామయ్య అవుతాడు. నేనే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అని, అందరితోటి చెబుతాడు వర్మ. కానీ, అవకాశాల కోసమని హైదరాబాద్ వచ్చిన మామని ఒక ఘోస్ట్ రైటరు గా, ఉపయోగించుకుంటున్నాడని ఎవరికీ తెలియదు. ఇందాకా చెప్పిన "ఆ తెలుగు ప్రజల ఆకాంక్ష" డయలాగు కూడా మామ రాసిందే. ఎప్పుడు అదో నవ్వు నవ్వుతూ ఉంటాడు మామ,  టీవీ వాళ్లకి కూడా ఇదే చెప్తాడు వర్మ.

వర్మ: చంపేస్తున్నారు, చూసావు కదా. (చేతి వేళ్ళు దగ్గరగా పెట్టి, అక్షింతలు వేస్తున్నట్టు) అతి చిన్న వయసులోనే పద్మశ్రీ సంపాదించిన వర్మ గారు (నవ్వుతున్నాడు. ఒకింత గొప్పగా నవ్వుతున్నాడు. మామ కూడా అదో రకం గా నవ్వుతున్నాడు)

వర్మ సంపాదించిన ఆస్తి, ఒక 1000 కోట్లు ఉంటుందని తెలిసిన వాళ్ళు అంటారు, కాని నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. అతనికి చాలా మంది ఘోస్ట్ రైటర్స్ ఉన్నారని, అన్నారు కొందరు, కాని ఎవరికీ ఆధారాలు దొరక లేదు.
అతనికి అంత సీను లేదని అన్న వాళ్ళూ ఉన్నారు, వాళ్ళు చివరికి ఇండస్ట్రీ లో బేరాలు లేక ఇంటికి పోవాల్సి వచ్చింది. మొత్తానికి అతని సీక్రెట్ ఏమిటో ఎవరికీ తెలియదనే చెప్పాలి.

-- 4 --

కారు లో అందరూ నవ్వుతున్నారు. వర్మ అయితే చాలా నవ్వుతున్నాడు, మామ నవ్వు షరా మామూలే. ఇంతలో వర్మ ఫోను రింగు అవుతోంది. వర్మ ఫోను తీసాడు.

వర్మ: (నవ్వు గొంతు తోటి) హలో...!

అవతలి వైపు: నాకు నీ సీక్రెట్ తెలుసు.

అది వింటూనే వర్మ మొహంలో రంగులు మారాయి.

వర్మ: (మరొక్క సారి కన్ఫర్మ్ చేసుకుందామని) హలో, హలో!

అవతలి వైపు: నాకు నీ రహస్యం తెలుసు,

వర్మ: ఏమిటి నువ్వు మాట్లాడు తున్నది ఏమి అర్ధం కావటం లే... (పక్కనే ఉన్న మామ కేసి చూస్తూ, ఎవరికీ తెలియకూడదని లో- వాయిస్ లో ...)

వర్మ పూర్తి చేసే ముందే అవతలి వైపు నించి,

అవతలి వైపు: ఒక అమ్మాయి. ఒకే ఒక అమ్మాయి. ఒక అమ్మాయి, పేరు చెప్పనా! ఆ?

వర్మ: (ఈ సారి గట్టి గొంతు తోటి) వద్దు.

అవతలి వైపు: అలా రా దారికి. నేను చెప్పిన చోట, చెప్పినప్పుడు కాలు, అంటే, ఓకేనా!

వర్మ: ఓకే!

అవతలి వైపు: (ఎదో చెప్పాడు)... ఇప్పుడు ఫోన్ పెట్టేయ్, ఒకే!


వర్మ: ఓకే!


మామ ఎప్పటిలా నవ్వుతూనే ఉన్నాడు, వర్మ మొహం లోనే నవ్వు లేదు. ఎలాగో ఇంటికి చేరాడు వర్మ.

(సశేషం)

Monday, December 10, 2012

చంద్ర స్పర్శ - I

    నిశ్శబ్ద నిశీధి లో, ఒక శిల ఆకాశాన్ని చీల్చుకుంటూ నేల మీద పడింది. అది ఆంధ్రప్రదేశ్ లోని దేవరకొండ గ్రామం.  నిశ్శబ్దం గా ఆ శిల ఆ రాత్రి పడటం, ఎవరూ గమనించలేదు. అప్పుడు సమయం అర్ధ రాత్రి  పన్నెండు కావస్తోంది. అది చంద్ర శిల. చంద్రుడి ఉపరితలం నించి వచ్చినది కాదు, చంద్రుని అంతర్భాగం లోనిది, లేత నీలి రంగులో ప్రకాశిస్తోంది అది.

    ఆ పక్కనే ఒక పూరి గుడిసె ఉంది, అందులో నించి ఒక  చిన్న పిల్లవాడు (8 years  ఉంటాయి).  నిద్ర కళ్ళతో బయటకి వచ్చాడు ఆవులించుకుంటూ. ఇంటి గోడ వైపుగా తిరిగి, ఒంటేలుకి వెళ్తున్నాడు. నిశ్చలమైన ఆ రాత్రిలో, కీచురాళ్ళ అరుపులు తప్ప అక్కడ శబ్దం లేదు. ఒంటేలు, గోడ  మీద పడి, వంకరలు తిరుగుతూ, నేల మీద వెళ్తోంది.

    సడన్ గా ఆ పిల్లవాడి కళ్ళు ఎర్రబారాయి. ఇతని వెనుక దూరం లో ఉన్న ఆ శిల, గాలిలో కొంచెం ఎత్తులో ఎగురుతున్నట్టు నిలబడి ఉంది. సరిగ్గా ప్రకాశిస్తున్న చంద్రుడు, అటు వైపు కనిపించాడు. ఆ శిల నించి కరెంటు లాగా వస్తోంది, నేల మీదకి. సరిగ్గా ఆ కింద నించే వెళ్తోంది, ఇతని ఒంటేలు.

    మారు మాట్లాడకుండా అతడు, జిప్ క్లోజ్ చేసుకుని ఇంట్లోకి దూరాడు. చిన్న నవ్వు కనిపిస్తోంది అతని మొహంలో.

-- 2 --

    తెల్లవారింది, ఈ రోజు దశమి, విజయ దశమి, దసరా రోజు. ఈ వూరి వారికి చాలా special  ఈ రోజు. ఊళ్ళో సగం మంది ఎవరితోనూ మాట్లాడటం లేదు అట.వాళ్ళందరూ secret  గా ఏదో చేస్తున్నారని, కొంతమంది అనుకుంటున్నారు, ఛలోక్తి గా. అయితే వాళ్ళ కళ్ళు ఎర్రబడటం, ఎవరూ గమనించ లేదు అనుకుంటా.

    మెల్లగా సాయం సమయం అవుతోంది, ప్రపంచం నిద్ర పోవటానికి  సిద్ధం అవుతోంది. ఆ పల్లెలో ఇంకా తెల్లవారినట్లే ఉంది. అందరూ, లేచే ఉన్నారు. అక్కడక్కడా మీటింగులు జరుగుతున్నాయి. వాటిల్లో, కర్రలతో ఎలా కొట్టుకోవాలో ఆలోచిస్తున్నారు. అవును మరి, ఇది దేవరకొండ. ప్రతి సంవత్సరం ఇక్కడ, విజయ దశమి నాడు, ఈ వూరి వాళ్ళు పక్క వూరి జనాలు కర్రలతో కొట్టుకునే ప్రదేశం ఇది.

-- 3 --
అప్పుడు సమయం రాత్రి ఒంటి గంట. అంబులెన్సుల మోతతో ఆ ప్రదేశం మార్మోగి పోతోంది. బుర్రలు పగిలి రక్తాలతో ఉన్నారు, ఆ పక్క ఊరి వాళ్ళు. దేవర కొండ జనాలు, పక్క ఊరి వారిని చితక కొట్టారట. చిన్న పిల్లలూ, పెద్దలూ అందరూ పాల్గోన్నారు, దేవరకొండ తరపున. ఇది విచిత్రమే అయినా ఒక్క పిల్ల వాడికి కూడా దెబ్బలు తగలలేదు, విచిత్రం గా.

పోలీసులు గన్ లతో ఉన్నారు. దేవర కొండ వాళ్ళు అందరినీ, పట్టుకుని, జీపుల్లో ఎక్కిస్తున్నారు. అందరూ స్వచ్చందం గానే ఎక్కుతున్నారు జీపులు. ఈ రాత్రికి, దగ్గరలోని ఒక ఊళ్ళో పోలీసు స్టేషన్ లో పెట్టారు, రేపు పొద్దున్న కర్నూలుకి తరలిస్తారట.

కొంత సేపటికి, అక్కడ చెవిలో నులుముకుంటూ ఒక పోలీసు వచ్చాడు, అతడిని చూసి అందరూ సాల్యూట్ చేస్తున్నారు. కళ్ళతోనే పుచ్చుకుంటూ, నడుస్తున్నాడు అతను. మూడు షర్టు బటన్ల ని తీసేసి, గుట్కా నములుతూ,  చాలా రఫ్ గా ఉన్నాడు. వీళ్ళందరినీ చూస్తూ, పనులని చూస్తున్నాడు అతను.

ఎందుకో నవ్వుతూ జీపు ఎక్కుతున్నఒకడి కాలరు పట్టుకున్నాడు పోలీసు. వాడికి ఎడా పెడా రెండు ఇచ్చాడు, అయినా వాడు నవ్వు ఆపలేదు. ఈ సారి మూతి మీద ఇచ్చాడు, అయినా ఆపలేదు వాడు. "పిచ్చేమో సార్ " వెనకాల కానిస్టేబులు అన్నాడు.

పోలీసు: (నోట్లో రక్తం కారుతున్న వాడిని చూసి) లేదు లేదు, ఉత్త acting. నాలుగు తగిలిస్తే వెంటనే కక్కుతారు నిజం. (హాండ్స్ ఫోల్డు చేసుకుంటూ అన్నాడు).

వాడు మాత్రం, జీపెక్కి నవ్వుతూనే కూర్చున్నాడు. వాడి పళ్ళు, రక్తం తో నిండి ఉన్నాయి, వికృతం గా కనిపిస్తున్నాయి.

-- 4 --

మర్నాడు పొద్దున్న, 3 మినీ బస్సులలో వచ్చారు అక్కడికి. రఘుపతి, CID inspector, ఆన్ స్పెషల్ డ్యూటి, అక్కడికి రావడం జరిగింది. వస్తూనే, మన ఇన్స్పెక్టర్ తో,

రఘు: నాకన్ని డీటైల్స్ కావాలి. అసలీ సంఘటన ఎలా జరిగిందో, ఎవరికీ ఎలా నష్టం జరిగిందో అన్నీ కావాలి. ఇంకోటి, ఆ వూళ్ళో, పేరు ఏమిటి అన్నావు ...

Inspector: దేవర కొండ సార్! (నోట్లో కిళ్ళీ నములుతూ, చేతులు దండ కట్టుకుని అన్నాడు).

రఘు: ఆ కిళ్ళీ ఏమిటి అసహ్యంగా, ఉమ్మేయ్! (కళ్ళు చిట్లించి అన్నాడు. వెంటనే ఉమ్మేశాడు inspector).

రఘు: (మళ్ళీ తనే ...) అదే దేవరకొండ. ఆ వూళ్ళో ఇంత క్రితం ఇలాంటి వేమైనా జరిగాయా, ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి వన్నె నాకు కావాలి.

రఘు: (కొంచెం సేపు తర్వాత ...) ఆ, ఒక్కటి మరిచిపోయాను. ఇక్కడ, ఒక మంచి డాక్టరు ఎవరు ఉన్నారు.

Inspector: ఇక్కడంటే కష్టం సార్, కర్నూలు పోవాలి అంతే! (చేతులు కట్టుకుని చెప్పాడు).

(సశేషం ...)